తిరుమల : పవిత్రమైన తిరుమలలో ( Tirumala ) అసభ్యకర వీడియోలు, వెకిలి చేష్టలతో రీల్స్ ( Social media reels) చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది ( TTD warns) . తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం, పవిత్రతను కాపాడడంలో సహకరించాలని భక్తులకు విజ్ఞప్తి చేసింది . ఇటీవల కొందరు తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట , మాడ వీధుల్లో వెకిలి చేష్టలు, నృత్యాలు ప్రదర్శిస్తూ వీడియోలు (Reels) చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారని ఆరోపించింది.
పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి అభ్యంతరకర ,అసభ్యకర చర్యలను సహించబోమని సంబంధిత అధికారులు గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ తరహా చర్యలు ఆధ్యాత్మిక వాతావరణానికి విఘాతం కలిగిస్తున్నాయని వెల్లడించారు. తిరుమలలో కేవలం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకే పరిమితం కావాలని, శ్రీవారి దర్శనార్థం వచ్చే లక్షలాది మంది భక్తుల మనోభావాల పట్ల గౌరవం చూపడం ప్రతి ఒక్కరి బాధ్యతని గుర్తు చేశారు.
టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది ఇలాంటి వీడియోలు చిత్రీకరించేవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటారని వెల్లడించారు. తిరుమల పవిత్రతను భంగం కలిగేలా వ్యవహరించే వ్యక్తులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది.