Kethireddy : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై కేసు నమోదైంది. తనపై కేతిరెడ్డి, ఆయన అనుచరులు హత్యాయత్నం చేశారని బీజేపీ కార్యకర్త ప్రతాప్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేతిరెడ్డిపైన, ఆయన అనుచరులపైన కేసు నమోదు చేశారు.
ఇటీవల ధర్మవరం సబ్‌జైలు దగ్గర జరిగిన ఘటన నేపథ్యంలో పోలీసులు బీజేపీ కార్యకర్త ఫిర్యాదు మేరకు కేతిరెడ్డితోపాటు ఆయన అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అంతేగాక ఆయనకు నోటీసులు జారీచేశారు. కాగా, ఇటీవల వైసీపీ రిమాండ్ ఖైదీలను పరామర్శించేందుకు ధర్మవరం సబ్ జైలుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని కూటమి నేతలు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా కేతిరెడ్డి కారుపైకి ఎక్కేందుకు ఓ కార్యకర్త ప్రయత్నించాడు. అయినా కారును ఆపకుండా వేగంగా దూసుకెళ్లడంతో ఆ కార్యకర్త కిందపడ్డాడు. ఈ ఘటనలో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. ఆ ఘటనపై ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ మండిపడ్డారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. జైలు వెళ్లే ఆలోచన ఉంటే కేతిరెడ్డికి త్వరలో ఆ పని చేసి చూపిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇవాళ కేతిరెడ్డిపై కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది.