Kurnool Bus Fire | కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రమేశ్ అనే ప్రయాణికుడి ఫిర్యాదు మేరకు ఉళ్లిందకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. 125 C/A, 106 C/1 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ప్రమాద సమయంలో బస్సు నడిపిన ప్రధాన డ్రైవర్‌ను పల్నాడు జిల్లా కారంపూడిలోని ఒప్పిచర్లకు చెందిన శివనారాయణగా గుర్తించారు. 2004 నుంచి అతను డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. కాగా వేమూరి కావేరి ట్రావెల్స్‌లో అతను ఏడాదిన్నరగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాన డ్రైవర్ శివనారాయణతో పాటు తోటి డ్రైవర్ ముత్యాల లక్ష్మయ్యను పోలీసులు అరెస్టు చేశారు. యాజమాన్యంపైనా కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు (Bus Fire Accident) కర్నూలు సమీపంలో ఘోర ప్రమాదానికి గురైంది. హైదరాబాద్‌లో గురువారం రాత్రి 10.30 గంటలకు ప్రారంభమైన బస్సు శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కర్నూలు జిల్లా చిన్నటేకూరుకు చేరుకున్నది. ఈ క్రమంలో ఓ బైకును ట్రావెల్స్ బస్సు ఢీకొన్నది. అనంతరం 300 మీటర్ల వరకు బైక్‌ను లాక్కొని వెళ్లిపోయింది. బైక్ బస్సు కింది భాగంలో చిక్కుకోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంలో బస్సు మొత్తానికి మంటలు వ్యాపించడంతో క్షణాల్లోనే కాలి బూడిదైంది. అయితే బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 19 మంది ఎమర్జెన్సీ డోర్ పగులగొట్టుకుని నుంచి బయటకు వచ్చారు. మిగిలినవారు కాలిబూడిదయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 41 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు. వారిలో 11 మంది సజీవ దహనం అయ్యారు. మరణించిన 19 మంది మృతదేహాలను వెలికితీసిన అధికారులు.. అక్కడే పోస్టుమార్టం పూర్తి చేశారు. మృతదేహాల గుర్తింపు కోసం డీఎన్ఏ పరీక్షలు చేయనున్నారు.