తిరుమల : తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ( Brahmotsavam ) సందర్భంగా అక్టోబరు 4 నుంచి 12 వరకు దాతలకు వసతి (Accommodation) సౌకర్యాన్ని రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు(TTD) ప్రకటించారు. బ్రహ్మోత్సవాల్లో సాధారణ యాత్రికులకు మరిన్ని వసతి సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
వివిధ ట్రస్ట్‌లు, స్కీమ్‌ల దాతల కోసం వసతి బ్లాక్ చేయబడిందని తెలిపారు. అక్టోబరు 4న ధ్వజారోహణం, అక్టోబర్ 12న చక్రస్నానం జరిగే రోజుల్లో మినహా దాతలకు అందుబాటులో ఉన్న ప్రత్యేకాధికారాల ప్రకారం దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని, దాతలు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరారు.
స్వామివారి హుండీ ఆదాయం రూ. 3.89 కోట్లు
తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో 22 కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందన్నారు. నిన్న స్వామివారిని 71,595 మంది భక్తులు దర్శించుకోగా 28,981 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.89 కోట్లు వచ్చిందన్నారు.