RS Praveen Kumar | ఏపీ సీఎం చంద్రబాబుపై బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐపీఎస్ పీవీ సునీల్‌కుమార్‌పై క్రమశిక్షణ చర్యల పేరుతో ఏపీ ప్రభుత్వం దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సునీల్‌కుమార్ ట్విట్టర్లో పెట్టిన పోస్టులో తప్పేముందని ప్రశ్నించారు.
మీ విజ్ఞతకే వదిలేస్తున్నా అని అనడం సర్వీస్ రూల్స్ ఉల్లంఘన ఎట్ల అవుతుందని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. ఒకసారి రాజ్యాంగంలోని ఆర్టికల్ 19ను మళ్లీ చదవాలని.. అప్పుడైనా విషయం అర్థమవుతుందేమోనని విమర్శించారు. ఇలాగే మీ దాడులు కొనసాగితే అఖిల భారత సర్వీసు అధికారులు ఎవరూ కూడా ప్రజలకు సేవ చేయడానికి ఆసక్తిని చూపించరని అన్నారు. అనుభవజ్ఞుడైన అడ్మినిస్ట్రేటర్‌ను అని చెప్పుకుంటూ ఇలా దౌర్జన్యాలను నిరంతరం కొనసాగిస్తున్నందుకు విచారంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి విమర్శించారు.
గత వైసీపీ ప్రభుత్వం హయాంలో 2021 మే 14తన తనను రాజద్రోహం కేసులో అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేశారని.. చంపేందుకు యత్నించారని ఇటీవల ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఇచ్చిన ఫిర్యాదును ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసులో ఏపీ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్‌తో పాటు మరికొందర్ని నిందితులుగా చేర్చి దర్యాప్తును ప్రారంభించింది. దీనిపై ఇటీవల పీవీ సునీల్‌కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘ సుప్రీంకోర్టులో మూడేళ్లు నడిచి, సాక్షాత్తూ సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నా’ అంటూ ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై సునీల్‌కుమార్ ట్వీట్ చేశారు. సునీల్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు అఖిల భారత సర్వీస్ ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందకు వస్తాయని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని పీవీ సునీల్‌కుమార్‌పై అభియోగాలను నమోదు చేసింది.