అమరావతి : ఏపీ సీఎం జగన్ బావ, మత ప్రబోధకుడు బ్రదర్ అనిల్ ముందరి కాళ్లకు బంధం వేస్తున్నారు ఏపీ క్రిస్టియన్ జేఏసీ నాయకులు . ఏపీలో అధికారంలోకి రావడానికి సహకరించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్, మైనార్టీ సమస్యలను ఏపీ సీఎం పట్టించుకోవడం లేదని మీరైనా పట్టించుకోవాలని ఒత్తిళ్లు పెరుగుతుండడంతో బ్రదర్ అనిల్ ఏపీలో పర్యటిస్తున్నారు. తిరుపతి, వైజాగ్‌లో పర్యటించి పలువురు నాయకులతో చర్చించి ప్రభుత్వ పనితీరుపై అడిగి తెలుసుకున్నారు.
పాదయాత్రలో ఇచ్చిన హామీలను పరిష్కరించడంలో జగన్ ప్రభుత్వం మూడు సంవత్సరాలుగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, కనీసం చర్చించడానికైనా సమయం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయ కులు తిరుపతి, ఆ తరువాత వైజాగ్‌లో బ్రదర్ అనిల్‌తో క్రిస్టియన్ సంఘాలు సమావేశం కావడం రాజకీయ చర్చకు దారితీసింది . రాజకీయ పార్టీ పెట్టాలని వివిధ సంఘాల ప్రతినిధుల నుంచి సూచనలు వస్తున్నాయని, పార్టీ పెట్టడం అంతా ఈజీ కాదని అంటూనే నర్మగర్భంగా పలు వ్యాఖ్యలు చేశారు.
అయితే బ్రదర్ అనిల్ పర్యటనలపై ఏపీ క్రిస్టియన్ జేఏసీ స్పందించింది. ఈ క్రమంలో ఇవాళ తిరుపతిలో ఏపీ క్రిస్టియన్ జేఏసీ భేటీ అయి చర్చించింది. బ్రదర్ అనిల్ రాజకీయ పార్టీ పెడతాననడం హాస్యాస్పదంగా ఉందని, దైవ సందేశం అందించే బ్రదర్ అనిల్ ఎప్పుడు రాజకీయ అవతారం ఎత్తాడో చెప్పాలని ఎద్దేవా చేశారు. ఇప్పటికే తెలంగాణలో వైఎస్సార్టీపీ పేరుతో వైఎస్ షర్మిల పార్టీ నడిపిస్తున్నారని, బ్రదర్ అనిల్ మీరు కూడా తెలంగాణలో పార్టీ పనులు చూసుకోవాలని, ఏపీ రాజకీయాల్లో తలదూర్చవద్దని వ్యాఖ్యలు చేయడం సంచలనం కలిగిస్తోంది.