అమరావతి : ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఆమె ఏకంగా ఐదుగురిని ఒకరికి తెలియకుండా మరొకరిని పెండ్లి చేసుకొని మోసాలకు పాల్పడిన నిత్య పెళ్లి కూతురిని పెద్దవడుగూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం దొండపూడికి చెందిన వజ్రపు మణి, ఎలియాస్ శ్వేతారెడ్డి ఎలియాస్ కీర్తి(27) వలపు వల వేసి మధ్య వర్తుల ద్వారా వివాహాలు చేసుకొని కొద్ది రోజుల గడిచాక డబ్బు, నగలతో ఉడాయించేది. ఈమె విజయవాడకు చెందిన మధ్య వర్తులు సుమప్రియ, అశోక్, శశికళ, రామకృష్ణ ద్వారా విహాలు సెటిల్ చేసుకుకునేది. ఈ క్రమంలో అనంతపురం జిల్లా పెద్ద వడుగూరుకు మండలం కాశేపల్లికి చెందిన యాపర్ల సుధీర్ రెడ్డి 2025లో వజ్రపు మణికి రూ.3.8 లక్షల ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు.
అయితే సుధీర్ రెడ్డి పట్టుమని మూడు రోజులే ఉన్న మణి ఒంట్లో బాగోలేదని పుట్టింటికి వెళ్తానని కోరింది. సుధీర్ రెడ్డి ఆమెను తీసుకొని రైలు బయలుదేరారు. నంద్యాల స్టేషన్ రాగానే నిందితురాలు రైలు దిగి మాయమైంది. సుధీర్ రెడ్డి ఎంత వెతికినా మణి కనిపించకపోవడంతో మోసపోయానని గుర్తించాడు. తనకు పెళ్లి కుదిర్చిన మధ్యవర్తులకు ఫోన్ చేయగా స్విచాఫ్ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటికే నిందితురాలు ఐదుగురిని ఇలాగే మోసం చేసిందిని, తనకు కొడుకు, కూతురు కూడా ఉన్నారని తెలుసుకున్నాడు. 2025 నుంచి పోలీసులు నిందితురాలి కోసం గాలించసాగారు.
అయితే వజ్రపు మణి కర్నాటకలోని మల్లెప్ప గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని వివాహం చేసుకొని అక్కడే ఉంటున్నది. మల్లెకుప్ప నుంచి చిత్తూరులోని మదనపల్లెకు వస్తున్న విషయాన్ని గుర్తించిన పోలీసులు నిందితురాలిని వలపన్ని పట్టుకున్నారు. మణితో పాటు మధ్యవర్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.