తిరుపతి : అప్పలాయగుంట(Appalayagunta) ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavam) భాగంగా స్వామివారు ఆదివారం సూర్యప్రభ వాహనంపై గోవర్ధనగిరిదారుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాతని అర్చకులు తెలిపారు.
సూర్యప్రభ (Suryaprabha) వాహనంలో స్వామివారిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని వెల్లడించారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారని చెప్పారు. వాహన సేవలో ఆలయ ఏఈవో రమేష్, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, కంకణ భట్టర్ సూర్య కుమార్ ఆచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
జూన్ 24న రథోత్సవం
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన సోమవారం రథోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఉదయం 9 గంటలకు స్వామివారు రథారోహణం , 9.25 నుంచి 11 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారని అన్నారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు అశ్వవాహనంపై దర్శనమిస్తారని తెలిపారు.