తిరుమల : తిరుమల (Tirumala) వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు(Brahmotsavam) గురువారం రాత్రి అంకురార్పణంతో ప్రారంభం కానున్నాయి. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు.
ఇందులో భాగంగా శ్రీవారి తరపున సేనాధిపతి అయిన విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని చెప్పారు. ఆలయంలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటుతారని, నవధాన్యాలకు మొలకలొచ్చేవరకు నీరు పోస్తారని వివరించారు. ఈ విత్తనాలు ఎంత బాగా మొలకెత్తితే అంత ఘనంగా ఉత్సవాలు నిర్వహించబడతాయన్నది నమ్మకమని వెల్లడించారు .
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) కలుగుతుందని టీటీడీ(TTD) అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 80,613 మంది భక్తులు దర్శించుకోగా 24,403 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 2.92 ఆదాయం వచ్చిందని తెలిపారు.