చిత్తూరు జిల్లా : సుప్రసిద్ధ కాణిపాకం వినాయకుడి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 20 వరకు కొనసాగుతాయి. గణనాయకుడి బ్రహ్మోత్సావలను తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు గణనాథుడు సిద్ధి, బుద్ధి సమేతంగా వివిధ వాహనాలలలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇచ్చారు. సత్య ప్రమాణాల దేవుడైన వినాయకుడ్ని దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రల నుంచి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు.
కాణిపాకం ఆలయంలో బ్రహ్మోత్సవాలు 21 రోజులపాటు అంగరంగ వైభవంగా కొనసాగుతాయి. ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఇవాళ రాత్రి హంసవాహన సేవలో భక్తులను అలరించనున్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవ వేడుకలు ఏటా వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 31న వినాయక చవితి మొదలు తొమ్మిది రోజుల పాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలు, తర్వాత 12 రోజుల పాటు ప్రత్యేక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాల చివరి రోజున స్వామి వారు స్వర్ణరథంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. నవరత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 9 న ధ్వజావరోహణంతో ముగుస్తాయి. మరుసటి రోజు నుంచి ప్రత్యేక బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 12 రోజుల్లో 12 రకాల వాహనాలపై స్వామివారు ఊరేగుతారు. ఈ నెల 20 న స్వామివారికి తెప్పోత్సవం నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల విద్యుత్ కటౌట్లు విశేష ఆకర్శణగా నిలిచాయి. ఆలయంలోని మూషిక, అన్వేటి, సుపథ మండపాలు, నవగ్రహ ఆలయం, అభయాంజనేయ స్వామి సన్నిధిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రధాన ద్వారం వద్దనున్న ధ్వజస్తంభాన్ని వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. విద్యుత్ దీపాలతో ఆలయ పరిసరాలను శోభాయమానంగా తీర్చిదిద్దారు. భక్తుల కాలక్షేపానికి ఆస్థాన మండపంలో, వరసిద్ధుడి అనుబంధ వరదరాజుల స్వామి ఆలయ ముందు ఏర్పాటు చేసిన పందిట్లో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి నిత్యం ఉత్సవమూర్తుల ఊరేగింపులో మేళ తాళాలు, భజనలు, పిల్లన గోవి పాటలు, భక్తి గీతాలాపనలు ఏర్పాటు చేశారు.