విజయవాడ: లేటరైట్ తవ్వకాలు అంటూనే బాక్సైట్ తరలిస్తున్నారని టీడీపీ జాతీయాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీ దినోత్సవం రోజునే ఇలాంటి దోపిడీలు బయటకు రావడం దురదృష్టకరమన్నారు. ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు. తాము తీసుకొచ్చిన బైక్ అంబులెన్సులను ఈ ప్రభుత్వం అటకెక్కించడంతో ఆదివాసీలు అనేక ఆరోగ్య కష్టాలు ఎదుర్కొంటున్నారని విచారం వ్యక్తం చేశారు. ఆదివాసీల అభివృద్ధి అంటూ గొప్పలకు పోతున్న జగన్ సర్కార్.. గిరిజనుల భూములను ఆక్రమించుకుంటున్నదని దుయ్యబట్టారు.
బాక్సైట్ తవ్వకాల కోసం ప్రభుత్వం అక్రమంగా అడవులను నరికేస్తుందని, లేటరైట్‌ను అడ్డుగా పెట్టుకుని బాక్సైట్‌ను తరలిస్తున్నారని ట్విట్టర్ వేదికగా చంద్రబాబు ఆరోపించారు. బాక్సైట్ తవ్వకాలను 2016 లో తాము అధికారంలో ఉన్నప్పుడు రద్దు చేశామని తెలిపారు. గిరిజన గ్రామాల్లో కనీస సౌకర్యాలు కరవయ్యాయని చెప్పారు. గిరిజనుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం 14 చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని జీఓలు తెచ్చిందని గుర్తుచేశారు. బాక్సైట్ తవ్వకాల కోసమే అడవుల్లో రోడ్లు వేస్తున్నారని, ఇది ఎంత మాత్రమూ అభివృద్ధి కాదన్నారు. ఇన్నేండ్లయినా ఇంకా డోలీల్లోనే రోగులను తరలించడం చూస్తే ఎంత అభివృద్ధి చేశారో అర్ధమవుతున్నదని పేర్కొన్నారు.
షెడ్యూల్డ్ ప్రాంతంలోని అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను జీఓ 3 ప్రకారం స్థానిక గిరిజన అభ్యర్థులతో భర్తీ చేయాలి. ఈ జీవోను ప్రస్తుత వైసీపీ హయాంలో కోర్టు రద్దు చేస్తే.. పునరుద్ధరణ కోసం ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నమూ చేయకపోవడం విచారకరమన్నారు. గిరిజనులకు ఆరోగ్యపరంగా దన్నుగా ఉండేందుకు తాము అధికారంలో ఉన్నప్పుడు బైక్ అంబులెన్సులను తీసుకొచ్చామని చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం అవి కనిపించడం లేదని, గిరిజనులకు సరైన వైద్యం అందించలేకపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. అడవుల్లో ఉన్నవారికి ఇప్పటికీ శుద్ధమైన తాగునీరు లభించడం లేదని, ఇంకనూ గెడ్డనీరే తాగుతుండటం జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఇకనైనా ఆదివాసీల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరమున్నదని చెప్పారు.
గిరిజన సోదరులకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ ఆది నుంచీ గిరిజన సంక్షేమం, గిరిజన హక్కుల పరిరక్షణ కోసం కృషిచేసింది. గిరిజన ప్రాంత భూములు, ఉద్యోగాలు, అటవీహక్కులు వంటి వాటికోసం ఆనాడు ఎన్టీఆర్ 14 చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని జీవోలు కూడా తెచ్చారు.(1/6)
— N Chandrababu Naidu (@ncbn) August 9, 2022