Vizianagaram | వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కుటుంబానికి పెను ప్రమాదం తప్పింది. విజయనగరంలో సిరిమానోత్సవం చూస్తుండగా వేదిక కూలింది. ఆ సమయంలో బొత్స కుటుంబం వేదికపైనే ఉంది. అయితే ఎటువంటి గాయాలు కాకుండా బొత్స ఫ్యామిలీ సురక్షితంగా బయటపడింది. కానీ ఈ ప్రమాదంలో ఎస్సై, మరో చిన్నారి గాయపడ్డారు.
ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రధాన ఘట్టమైన సిరిమానోత్సవం కన్నులపండువగా సాగుతోంది. పూజారి వెంకటరావు సిరిమాను అధిరోహించారు. చదరగుడి నుంచి విజయనగరం కోట వరకు సిరిమానును ఉరేగిస్తున్నారు. ఈ సిరిమానోత్సవం తిలకించేందుకు సతీసమేతంగా బొత్స సత్యనారాయణ వచ్చారు. ఈ క్రమంలోనే వేదికపై కూర్చుని ఉండగా అది కూలింది.