విజయవాడ: మెరుగైన పీఆర్సీ కోసం ఐక్య ఉద్యమ కార్యాచరణ ప్రకటించామని ఏపీ ఉద్యోగుల జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. డిమాండ్ల సాధనలో భాగంగా ఫిబ్రవరి 3న లక్షలాది ఉద్యోగులతో చలో విజయవాడ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవాడలో మన డిమాండ్లు మార్మోగేలా చేయాలని పిలుపునిచ్చారు.
ఉద్యోగులు నిర్వహించే చలో విజయవాడ కార్యక్రమం చూసైనా ప్రభుత్వంలో మార్పు రావాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నామని చెప్పారు. కార్మిక, ఉపాధ్యాయులు, పెన్షనర్లను జాగృతం చేసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తామన్నారు. మంత్రుల కమిటీతో చర్చలకు రాలేదని తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ప్రభుత్వానికి భారంగా ఉన్న రూ.10 వేల కోట్లు దాచి, మా పాత జీతాలు మాకు ఇవ్వండి అని ప్రభుత్వాన్నిడిమాండ్ చేస్తున్నామని బొప్పరాజు పేర్కొన్నారు. రూ.1,800 కోట్ల సప్లిమెంట్రీ బిల్లులు, రూ.2,100 కోట్ల బకాయి బిల్లులు వెంటనే చెల్లించాలని కోరారు. సీపీఎస్, పెన్షనర్లకు రావాల్సిన రూ.5వేల కోట్లు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని వెంటనే ఇప్పించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.