Srisailam Temple | శ్రీశైల క్షేత్ర గ్రామదేవతకు దేవస్థానం తరఫున అంకాళమ్మవారికి శుక్రవారం బోనం సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయ మహాద్వారం నుంచి ప్రధానార్చకులు వీరయ్యస్వామి, అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు ఉమానాగేశ్వరశాస్త్రి, ఆలయ సహాయ నిర్వహణ అధికారి హరిదాసు పలువురు అర్చకస్వాములు, వేదపండితులు సంప్రదాయబద్దంగా నూతన పట్టువస్త్రాలు, పసుపు కుంకుమలు, గాజులు, ఫలపుష్పాలతో అంకాళమ్మ ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అంకాళమ్మ అమ్మవారికి విశేష పూజలు చేశారు. అనంతరం బోనాన్ని సమర్పించారు. కార్యక్రమానికి ముందుగా సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, రోగకారక పరిస్థితులు రాకుండా ఉండాలని, జనులందరికీ ఆయురారోగ్యాలు చేకూరాలని సంకల్పం పఠించారు.