Vijayawada | విజయవాడలో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. నగరంలోని రైల్వే స్టేషన్‌తో పాటు బీసెంట్ రోడ్డులో బాంబు పెట్టినట్లుగా కంట్రోల్ రూమ్‌కు వేర్వేరు ఫోన్ కాల్స్ వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆయా ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ముందుగా బీసెంట్ రోడ్డులోని ఎల్ఐసీ బిల్డింగ్‌లో బాంబు పెట్టినట్లుగా ఓ ఆగంతకుడు శనివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో విజయవాడ కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. బాంబ్ స్క్వాడ్‌తో కలిసి నాలుగు బృందాలుగా ఏర్పడి బందర్ రోడ్డు నుంచి ఏలూరు రోడ్డు వరకు బీసెంట్ రోడ్డులో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. బాంబు బెదిరింపు కాల్ నేపథ్యంలో బీసెంట్ రోడ్డులోని అన్ని షాపులను మూసివేయించారు. సాధారణ ప్రజలు, వ్యాపారులు ఎవరూ ఈ రోడ్డులోకి రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. బీసెంట్ రోడ్డులోని షాపులు, తోపుడు బండ్లను క్షుణ్నంగా తనిఖీ చేశారు. ఎక్కడా బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఫేక్ కాల్ అని తేలడంతో మధ్యాహ్నం నుంచి బీసెంట్ రోడ్డులో వ్యాపారాలకు అనుమతినిచ్చారు.
ఆ తర్వాత కొద్దిసేపటికే విజయవాడ రైల్వే స్టేషన్‌కు కూడా బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. పాకిస్థాన్‌కు చెందిన హుస్సేన్ అని పేరు చెప్పుకుంటూ హిందీలో ఫోన్ కాల్ మాట్లాడటంతో అప్రమత్తమైన జీఆర్పీ, సీఎస్‌డబ్ల్యూ, బాంబు స్క్వాడ్ బృందాలు రైల్వే స్టేషన్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఎక్కడా అనుమానాస్పద వస్తువులేవీ కనిపించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ కాల్‌ను ట్రేస్ చేసిన టెక్నికల్ టీమ్.. దాన్ని ఫేక్ కాల్‌గా నిర్ధారించారు.