Palnadu Dist | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా గురజాల అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలో అధికార, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు పరస్పర దాడులకు దిగారు. పోలింగ్ ముగుస్తున్న వేళ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు నాటు బాంబులు, పెట్రోల్ సీసాలతో దాడులు చేశారు. ఆరు గంటల తర్వాత పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు బారులు తీరడంతో పోలింగ్ శాతం పెరుగుతుందని, అదే జరిగితే తమకు నష్టమేమోనన్న భయంతో వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు నాటు బాంబులు విసిరారు.
మరోవైపు, రాళ్ల వర్షం కురిపించడంతో పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు రక్షణ కోసం పరుగులు తీశారు. ఈ ఘర్షణలో పది టూ వీలర్లు, నాలుగు దుకాణాలు దెబ్బ తిన్నాయి. బాంబు దాడులు జరుగుతున్నా పోలీసుల్లో కనీస స్పందన లేదని టీడీపీ ఆరోపించింది. మారుమూల గ్రామం కావడం వల్లే సకాలంలో ఘటనా స్థలానికి చేరుకోలేకపోయామని పోలీసు అధికారులు అంటున్నారు.