ఏపీలో జనసేనతో పొత్తులపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ఈ విషయంపై తమతో చర్చిస్తే, తాము కూడా కచ్చితంగా స్పందిస్తామని ప్రకటించారు. ఏపీలో తమ మిత్రపక్షమైన జనసేన కార్యక్రమాలు, తమ పార్టీ కార్యక్రమాలు వేర్వేరైనా… జనసేన మాత్రం తమ మిత్రపక్షమేనని స్పష్టం చేశారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ బీజేపీ కార్యాలయంలో పురందేశ్వరి జెండా ఆవిష్కరణ చేశారు.
ఏపీలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అన్నారు. సేవ చేయడం కన్నా.. అధికారమే లక్ష్యంగా ఏపీలో రాజకీయాలు నడుస్తున్నాయని దెప్పి పొడిచారు. వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలూ ఢీలా పడిపోయాయని, పాలన ఏమాత్రం బాగోలేదని ఆమె విమర్శించారు. విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటు చేయడాన్ని ఆమె స్వాగతించారు. ఎప్పటి నుంచో ఈ విషయం ఎన్టీఆర్ కుటుంబీకుల కలగా ఉండిపోయిందని, ఈ కోరిక ఇప్పటికి నెరవేరిందని సంతృప్తి వ్యక్తం చేశారు.