Pawan Kalyan | ఏపీ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో దానిపై పోరాటానికి దిగారు. సనాతన పరిరక్షణ కోసం నడుం బిగించారు. దీంతో బీజేపీ కాషాయ రాజకీయాలను పవన్ కల్యాణ్ ఫాలో అవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. బీజేపీ పెద్దలు ఏం చెబితే దానికి తగ్గట్టుగా పవన్ కల్యాణ్ ఆడుతున్నారని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలో సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను బీజేపీ ఆడిస్తోందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. చంద్రబాబును దింపేసి ఆ స్థానంలో పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కుట్రలు పన్నుతోందని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు పవన్ కల్యాణ్‌ను బీజేపీ వాడుకుంటుందని ఆరోపించారు. వంద రోజుల్లోనే కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని విమర్శించారు.
మరోవైపు పిఠాపురంలో మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్యంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ అమానుష చర్యను సభ్య సమాజంలోని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ముద్దాయికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.