AP Politics | ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీ-జనసేనకు బీజేపీ షాకిచ్చేందుకు సిద్ధమయ్యింది. నిన్నమొన్నటిదాకా టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందని భావించినప్పటికీ.. ఇప్పుడు బీజేపీ సొంతంగానే ఎన్నికల బరిలోకి దిగాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీతో పాటు ఢిల్లీలో తాజాగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో బీజేపీ కొత్త స్కెచ్ వేస్తున్నది. కాపు సీఎం నినాదంతో ఏపీ ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ సీఎం నినాదంతో ముందుకెళ్లిన కాషాయ పార్టీ.. ఏపీలో కూడా కాపు సీఎం నినాదంతో ముందుకెళ్తే సక్సెస్ అవుతామని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే తెలుగు దేశం పార్టీ నుంచి కమ్మ, వైసీపీ నుంచి రెడ్లు సీఎంలుగా ఉన్నారు. కానీ ఏపీలో అతిపెద్ద సామాజికవర్గమైన కాపుల్లో మాత్రం ముఖ్యమంత్రులు లేరు. కాపు నేతగా పవన్ కళ్యాణ్‌కు మంచి గుర్తింపే ఉన్నప్పటికీ ఆయన సొంతంగా బరిలో దిగే ఆలోచనలో లేడు. కాపులు సీఎం అవ్వడం కల్లనే అన్నట్టుగా ఆయన వ్యవహార శైలి ఉన్నది. టీడీపీతో పొత్తులో భాగంగా కేవలం 24 సీట్లను మాత్రమే తీసుకోవడంపై కూడా కాపు నేతల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో కాపు సీఎం నినాదంతో ముందుకెళ్తే ఏపీలో సీట్లు పెంచుకోవడంతో పాటు, ఓటింగ్ పర్సెంటేజ్ కూడా గణనీయంగా పెరిగే ఛాన్స్ ఉందని బీజేపీ యోచిస్తోంది. దీనికి సంబంధించి బీజేపీ ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా మొదలుపెట్టింది.
ఏపీ ఎన్నికల్లో సొంతంగా బరిలోకి దిగనున్న నేపథ్యంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తున్నది. ఆపరేషన్ ఆకర్ష్‌తో ఇతర పార్టీల నుంచి భారీగా నేతలను చేర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నది. టీడీపీ, వైసీపీ పార్టీలో టికెట్ దక్కని అసమ్మతి నేతలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే 30 నుంచి 40 మంది లీడర్లు బీజేపీ నాయకులతో టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా, రేపు, ఎల్లుండి విజయవాడలో బీజేపీ కీలక సమావేశాలు జరగనున్నాయి. వీటికి ఢిల్లీ నుంచి కూడా ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఈ సమావేశాల్లోనే బీజేపీ తదుపరి కార్యాచరణపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.