Free Bus | మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన స్త్రీ శక్తి పథకంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచిత బస్సు ప్రయాణంలో మహిళల డామినేషన్ ఎక్కువైందని ఆరోపించారు. టికెట్ ఉన్న మగవాళ్లను కూడా బస్సులో నుంచి దించేస్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని ఆర్టీసీ యూనియన్ నాయకులే తనకు స్వయంగా చెప్పారని పేర్కొన్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో మగాళ్లు ఇబ్బంది పడుతున్నారని విష్ణుకుమార్ రాజు తెలిపారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన సూపర్ సిక్స్ పథకాల అమలులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే వైజాగ్‌లో ఏర్పాటు చేస్తున్న గూగుల్ డేటా సెంటర్‌తో రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయన్న వార్తలను కూడా ఆయన కొట్టిపారేశారు. గూగుల్‌లో 1.80 లక్షల ఉద్యోగాలు వస్తాయనే మాట అవాస్తవమని స్పష్టం చేశారు. ఈ ఉద్యోగాల కల్పనపై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ చెబుతున్న వ్యాఖ్యలను అబద్ధమని పరోక్షంగా స్పష్టం చేశారు.
నిజం చెప్పడానికి తనకు మొహమాటం ఏమీ లేదని విష్ణుకుమార్ రాజు అన్నారు. డేటా సెంటర్ అంటే.. కాల్ సెంటర్లా కాదని తెలిపారు. డేటా సెంటర్ ఏర్పాటుతో ఎక్కువ ఉద్యోగాలు రావు.. ప్రచారం జరుగుతున్నట్లుగా 1.80 లక్షల ఉద్యోగాలు రావడం అవాస్తవమని తెలిపారు. రెండు, మూడు వేలలో మాత్రమే ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. గూగుల్ వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయనేది సమస్య కాదని.. దాని వల్ల బ్రాండ్ ఎంత పెరుగుతుందనేదే ముఖ్యమని వివరించారు.