Daggubati Purandheswari | వైసీపీ అధినేత వైఎస్ జగన్కు ఎంపీ, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కౌంటరిచ్చారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ కోరడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో జరిగిన ఘోరాలపై నాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. కేంద్రానికి లేఖ రాసిన వాళ్లు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.
గత ఐదేళ్లలో వైసీపీ అరాచక పాలన కొనసాగిందని దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఆ విషయాన్ని ఇంకా ప్రజలు మరిచిపోలేదని తెలిపారు. తన అక్క మీద దౌర్జన్యం చేస్తున్నారని అడిగితే 16 ఏళ్ల అమ్మాయిని కిరాతకంగా చంపేశారని.. దీనిపై స్పందించలేదని అన్నారు. ఉత్తరాంధ్రలో ఆక్సిజన్ కొరత ఉందని కరోనా సమయంలో ఓ డాక్టర్ ప్రశ్నిస్తే అతన్ని తీవ్ర ఇబ్బందులు పెట్టారని తెలిపారు. లోకల్ బాడీ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వెళ్లిన అభ్యర్థుల చేతుల్లో ఉన్న నామినేషన్ పత్రాలను చింపేశారని చెప్పారు. నెల్లూరులో కత్తులతో ఓ మహిళా కార్యకర్తను గాయపరిచారని అన్నారు. లేఖ రాయడం కాదు.. గుండెలపై చేయి వేసుకుని వైఎస్ జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.
కేంద్ర ప్రభుత్వం సహకారం లేనిదే ఏపీలో అభివృద్ధి సాధ్యం కాదని దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఏపీకి కేంద్రం అన్నిరకాల సహకారం అందిస్తూనే ఉందని పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాలపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని, సోషల్ మీడియాలో పర్యవేక్షణ పెట్టాలని సూచించారు. గతంలో వైఎస్ జగన్ సర్కార్కు కేంద్ర ప్రభుత్వ సహకార నిరాకరణపై పేర్ని నాని విఫులంగా చెప్పాలని డిమాండ్ చేశారు.