Pithapuram | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. బిల్లుల చెల్లింపు విషయంలో ఇద్దరు అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. మున్సిపల్ కమిషనర్ కనకరావు, డీఈఈ భవానీ శంకర్ మధ్య మొదలైన ఈ గొడవ వాళ్లిద్దరూ తన్నుకునే దాకా వెళ్లింది.
కొంతకాలంగా కమిషనర్ కనకారావు, డీఈ భవానీ శంకర్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో డీఈ భవానీ శంకర్ సెలవులపై వెళ్లారు. దీంతో పలు బిల్లుల చెల్లింపులకు సంబంధించిన ఫైల్స్‌పై డీఈకి బదులు ఈఈ చేత కమిషనర్ కనకారావు సంతకాలు చేయించుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇదిలా ఉంటే పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు, చెల్లింపుల విషయంలో కౌన్సిలర్లు పలు ప్రశ్నలు అడిగారు.
పిఠాపురంలో తన్నుకున్న మున్సిపల్ కమీషనర్, డిఈఈ
అందరి ముందే ఘర్షణకు దిగిన ఇద్దరు ప్రభుత్వ ఉన్నతాధికారులు pic.twitter.com/zuA2XQNCd5
— Telugu Scribe (@TeluguScribe) August 31, 2024
దీనికి డీఈ భవానీ శంకర్‌ను తప్పుబడుతూ కమిషనర్ సమాధానమిచ్చారు. దీంతో భవానీ శంకర్ లేచి.. కమిషనర్ కనకారావుపై ప్రత్యారోపణలు చేశారు. వాగ్వాదంతో మొదలైన ఈ గొడవ పిడిగుద్దులు గుద్దుకోవడం దాకా వెళ్లింది. అది చూసి కౌన్సిలర్లు షాక్ అయ్యారు. ఇద్దరి మధ్య గొడవ ముదరడంతో వెంటనే తోటి ఉద్యోగులు, కౌన్సిలర్లు కలిసి వారిని విడిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.