Bhumana Karunakar Reddy | టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపై మాజీ చైర్మన్, వైసీపీ అధినేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఆయన చైర్మన్ పదవి స్వీకరించినప్పటి నుంచి గోశాలలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. గోశాలను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలన్న ఆలోచన తప్పే కదా అని ప్రశ్నించారు.
గోశాల నిర్వహణ సరిగ్గా లేదు అనే విషయం బోర్డు దృష్టికి వచ్చింది అని టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు స్వయంగా చెప్పారని భూమన కరుణాకర్ రెడ్డి గుర్తుచేశారు. గోశాల నిర్వహణకు ప్రత్యేక కమిటీని వేసి నిపుణుల కమిటీని వేసి గోశాలను స్వచ్ఛంద సేవా సంస్థలకు ఎవరికైనా సంస్థలకు ఇచ్చేటువంటి ఆలోచన ఉందన్నారని తెలిపారు. వచ్చే బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని అన్నారని చెప్పారు.
సరిగ్గా ఏప్రిల్ నెలలో నేను గోశాల నిర్వహణ సరిగ్గా లేనందువలన గోవులకు అపాయకరమైనటువంటి పరిస్థితి వచ్చిందని.. గోవుల మరణాలు జరిగాయని చెప్పాను కదా అని ఈ సందర్భంగా బీఆర్ నాయుడికి భూమన కరుణాకర్ రెడ్డి గుర్తుచేశారు. బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డిని తనపై ఉసిగొల్పి గోవుల మరణం నేను ప్రకటించడం కారణంగా మత విద్వేషాలను, హిందూ ధార్మికతను దెబ్బతీస్తున్నానని, మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నాడు అని నామీద అనేక సెక్షన్లతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపారు. కేసు రిజిస్టర్ కూడా చేశారని.. దానిపై విచారణకు కూడా హాజరయ్యానని పేర్కొన్నారు. నిన్న ప్రెస్మీట్లో బహిరంగంగా మీరు కూడా గోశాల నిర్వహణ సరిగ్గా లేదని అన్నారు కాబట్టి.. నా మీద ఏ సెక్షన్లతో కేసులు పెట్టారో.. అవే సెక్షన్లు మీకు కూడా వస్తాయని బీఆర్ నాయుడిని ఉద్దేశించి అన్నారు.
గోశాల సంరక్షణ బాధ్యత సరిగ్గా లేదు అని చెప్పిన దానికి నామీద అనేక నిందారోపణలు వేశారని బీఆర్ నాయుడు అన్నారు. నన్ను గోశాలకు రానివ్వకుండా 8 మంది శాసనసభ్యులతో అక్కడ పెద్ద ఎత్తున రాద్ధాంతం చేయించి పాలకమండలి సభ్యులు కూడా అక్కడ ఉన్నారని తెలిపారు. నేను గతంలో చెప్పిందే బీఆర్ నాయుడు నిన్న మీడియా సమావేశంలో చెప్పారని అన్నారు.
దాదాపు 70ఏళ్లుగా టీటీడీ ఆధ్వర్యంలో అతి గొప్పగా నిర్వహిస్తున్న గోశాల బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయిన తర్వాత నిర్వీర్యం అయిపోయిందని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. దీన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలా అన్నటువంటి ఆలోచన రావటం కూడా తప్పే కదా అని ప్రశ్నించారు. మీ హయాంలో మీరు వైకుంఠ ఏకాదశి నిర్వహణను సరిగ్గా చేయలేరని.. గోశాలను సరిగ్గా నిర్వహించలేరని విమర్శించారు. అంటే మీ పాలకమండలి నిర్వాహంలో మీరు ఏ విషయాన్ని కూడా సమర్థవంతంగా చేయలేరని అన్నారు. ఒక వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఆరోజు ప్రయత్నించానని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. కానీ నా మీద అకారణంగా అనేక సెక్షన్లతో కేసులు పెట్టారని మండిపడ్డారు. కానీ ఇవాళ గోశాల నిర్వహణ సరిగ్గా లేదన్న వాస్తవాన్ని మీరే ఒప్పుకున్నారని స్పష్టం చేశారు. దీని ద్వారా మీరు నామీద పెట్టిన కేసులన్నీ కూడా నన్ను భయపెట్టేందుకు పెట్టినవే అని అందరికీ తెలిసిందని వ్యాఖ్యానించారు. ఇలాంటి తప్పులు మీరెన్ని చేసినా వాటన్నింటినీ ఎత్తిచూపడం ఒక పూర్వ చైర్మన్గా నా బాధ్యత అని స్పష్టంచేశారు.