TTD | టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో తిరుమలలో భూ ఆక్రమణలు జరుగుతున్నాయని మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. దేవుడి భూమిని రక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడికి లేదా అని ప్రశ్నించారు. తిరుపతిలో భూమన మీడియాతో మాట్లాడుతూ.. భూ ఆక్రమణలపై బీఆర్ నాయుడు, చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అలిపిరి రోడ్డులోని రూ.1500 కోట్లకుపైగా విలువ చేసే 25 ఎకరాల టీటీడీ భూమిని టూరిజం శాఖకు ఎలా కేటాయిస్తారని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఆలయానికి సంబంధించిన భూమిని టూరిజానికి ఇవ్వడం నేరమని.. ఆలయ భూములను పర్యాటకానికి కట్టబెట్టడంపై టీటీడీ బోర్డు మీటింగ్‌లో తాము అభ్యంతరాలు తెలిపామని తెలిపారు. కానీ తమ అభ్యంతరాలను తిరస్కరించారని మండిపడ్డారు. అత్యంత విలువైన భూమి అన్యాక్రాంతం అవుతోందని.. దేవుడి భూమిని రక్షించాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా అని ఆయన ప్రశ్నించారు.
టీటీడీ భూమిని టూరిజం శాఖకు ఎందుకు ఇస్తున్నారని భూమన ప్రశ్నించారు. టీటీడీ చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదని తెలిపారు. వాణిజ్య అవసరాల కోసం దేవుడి భూమిని వాడుకుంటారా అని మండిపడ్డారు. అత్యంత పవిత్రమైన టీటీడీ ల్యాండ్‌ను టూరిజానికి ఇవ్వడమేంటని.. మరెక్కడైనా ఉన్న ప్రభుత్వ భూమిని టూరిజానికి ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించారు. అరవిందో హాస్పిటల్, టాటా క్యాన్సర్ ఆస్పత్రి మధ్యలో ఉన్న రూ.1500 కోట్ల విలువైన 20 ఎకరాల స్థలాన్ని ఒబెరాయ్ హోటల్‌కు ఇవ్వాలని చూస్తున్నారని ఆరోపించారు. తిరుపతి రూరల్, రేణిగుంట, చంద్రగిరి మండలంలో రెవెన్యూ భూమి ఇవ్వొచ్చు కదా అని సూచించారు.