Free Bus Scheme | ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఆగస్టు 15వ తేదీ నుంచి స్త్రీ శక్తి పేరుతో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారభించబోతుంది. అయితే, ఈ పథకంపై ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే తమ జీవితాలు ప్రమాదంలో పడతాయని భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే ఆటో డ్రైవర్ల భద్రత కోసం తగిన ఏర్పాట్లు చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్‌కు ఆటో డ్రైవర్లు వినతి పత్రం అందజేశారు.
ప్రతి ఆటోకు పెట్రోల్, డీజిల్ కొట్టించి, నెలకు 26వేల రూపాయలు ఇస్తే.. ఆర్టీసీ వాళ్లు ఎలా మహిళలను ఉచితంగా గమ్యస్థానానికి చేరుస్తున్నారో.. అలాగే తాము కూడా మహిళలను ఫ్రీగా తీసుకెళ్తామని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. రోజుకు 8 గంటల పాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ పథకాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. మమ్మల్ని కూడా స్త్రీశక్తి పథకంలో భాగస్వాములను చేయండని విజ్ఞప్తి చేశారు.
ఉపాధి సమస్యల కారణంగా పెద్ద పెద్ద చదువులు చదివి కూడా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న వాళ్లు చాలామంది ఉన్నారని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పెట్రోల్, డీజిల్ ద్వారా గంటగంటకు ట్యాక్స్‌లు కడుతున్న అతిముఖ్యమైన కార్మికుడు ఆటో డ్రైవర్ మాత్రమేనని చెప్పారు. కానీ ఆటో డ్రైవర్‌కు ఏమైనా జరిగితే వాళ్ల కుటుంబాలు దిక్కులేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే పెట్రోలు, డీజిల్ మీద విధించే సెస్‌తో ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఏపీలో ఫ్రీ బస్సు పథకం ప్రారంభానికి ముందే తిరగబడ్డ ఆటో డ్రైవర్లు
ఆటోల్లో పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించి, నెలకు రూ.26 వేలు ఇస్తే.. తాము రోజుకు 8 గంటలు ఆటో నడిపి, మహిళలను ఫ్రీగా దించుతామని ఆటో డ్రైవర్ల డిమాండ్
ఫ్రీ బస్సు పథకం వల్ల తాము రోడ్డున పడతామని కాకినాడ పట్టణంలో నిరసన ర్యాలీ… https://t.co/kncq3v8GjZ pic.twitter.com/kRZ7ojFU6U
— Telugu Scribe (@TeluguScribe) August 12, 2025
పంద్రాగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా సోమవారం ప్రకటించింది. దీని ప్రకారం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదో ఒక కార్డు చూపించి మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణం పొందవచ్చు. బాలికలు, మహిళలతో పాటు ట్రాన్స్జెండర్లకు కూడా ఉచిత ప్రయాణం అందించనున్నారు.
నాన్‌స్టాప్, సరిహద్దు రాష్ట్రాల మధ్య తిరిగే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. తిరుమల ఘాట్ రోడ్డుపైకి వెళ్లే సప్తగిరి ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం లేదు. అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సుల్లో ఈ పథకం వర్తించదు. మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తగు చర్యలు తీసుకోనున్నారు. అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు, కండక్టర్లకు బాడీ వార్న్ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.