Nandigam Suresh | బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌పై మరో కేసు నమోదైంది. మంత్రి సత్యకుమార్ యాదవ్‌పై గతేడాది దాడికి సంబంధించి నందిగం సురేశ్‌పై తుళ్లూరు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. బోరుగడ్డ అనిల్ కుమార్ పేరును కూడా ఈ కేసులో చేర్చారు. ఇందులో ఏ1గా నందిగం సురేశ్, ఏ2గా బోరుగడ్డ అనిల్ పేర్లు ఉన్నాయి.
గత ఏడాది మార్చి 31న అమరావతి ఉద్యమంలో భాగంగా రాజధాని గ్రామమైన మందడంలో నిర్వహించిన సమావేశానికి సత్యకుమార్ యాదవ్, మరికొందరు నేతలు వచ్చారు. తిరిగి వెళ్తున్న సమయంలో మూడు రాజధానుల శిబిరం వద్ద అప్పటి బాపట్ల ఎంపీ నందిగం సురేశ్, వైసీపీ నాయకుడు బోరుగడ్డ అనిల్ అడ్డుకున్నారు. తమ అనుచరులతో కలిసి ఇసుప రాడ్లు, రాళ్లతో దాడి చేశారు. ఈ సమయంలో నందిగం సురేశ్ తన అనుచరులను రెచ్చగొట్టినట్లు బీజేపీ యువజన నాయకుడు సురేశ్ తెలిపారు. అయితే అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండటంతో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం నాడు మళ్లీ ఫిర్యాదు చేశామని చెప్పారు.