అమరావతి : పవిత్రపుణ్యక్షేత్ర ప్రాంతమైన తిరుపతి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని ఎమ్మారాజుల కంట్రిగ గ్రామంలో బాలికపై ముగ్గురు యువకులు సామూహికంగా లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం సృష్టిస్తోంది. గణేశ్ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా నిర్వహించిన ఊరేగింపును తిలకించేందుకు వచ్చిన బాలికకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు.
బాలిక ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో బాలిక తల్లి, అమ్మమ్మ కేవీపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది . దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ దాడిలో ముగ్గురు యువకులు పాల్గొన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు.