కడప జిల్లా : ఏటీఎంలలో నగదు నింపే వ్యాను డ్రైవర్ పెద్ద మొత్తంలో డబ్బుతో పరారయ్యాడు. వ్యాను డ్రైవర్ ఎత్తుకెళ్లిన డబ్బు మొత్తం రూ.60 లక్షల వరకు ఉంటుందని సదరు బ్యాంకు అధికారులు గుర్తించారు. ఈ ఘటన కడప జిల్లాలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్నది. నగదుతో పారిపోయిన వ్యాన్ డ్రైవర్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. కడప నగరంలోని వివిధ ప్రదేశాల్లో ఉన్న ఓ బ్యాంకుకు చెందిన ఏటీఎంలలో నగదును నింపే బాధ్యతను ఒక ఏజెన్సీకి ఇచ్చింది. నిత్యం సదరు ఏజెన్సీ సిబ్బంది ఆయా ఏటీఎంలలో నగదు నిల్వలను సరిచూస్తుంటారు. అయితే, శుక్రవారం బ్యాంకు నుంచి రూ.80 లక్షల నగదు తీసుకుని వాహనంలో ఏజెన్సీ సిబ్బంది బయలుదేరారు. ఐటీఐ సర్కిల్లోని బ్యాంకు ఏటీఎం వద్దకు సిబ్బంది వెళ్లగా.. ఇదే అదనుగా వ్యాను డ్రైవర్ షారుఖ్ వాహనంతో పరారయ్యాడు.
డ్రైవర్ షారుఖ్ పట్టుకెళ్లిన వాహనంలో దాదాపు రూ.60 లక్షల వరకు నగదు ఉన్నట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. నగర శివారులోని వినాయకనగర్ వద్ద డ్రైవర్ వ్యానును వదిలిపెట్టి నగదును సంచుల్లో వేసుకుని పరారైనట్లు సీసీ కెమెరాల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. బ్యాంకు అధికారులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఐటీఐ సర్కిల్ నుంచి శివారులోని వినాయకనగర్ వరకు ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని కడప ఎస్పీ చెప్పారు. డ్రైవర్ షారుఖ్‌కు సంబంధించిన వివరాలను ఆరా తీసేందుకు, నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.