అమరావతి : ప్రధాని మోదీ పాలనలో కార్పొరేట్ల ఆస్తులు రెట్టింపు కాగా పేదల కష్టాలు మరింత దారుణంగా మారాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. సీపీఐ 24వ జాతీయ మహాసభలు విజయవాడలో శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. మహాసభల ప్రారంభ సూచికగా జెండాను జాతీయ ప్రధాన కార్యదర్శి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు చేస్తుందని దుయ్యబట్టారు.
దేశంలో మైనారిటీలు, ఎస్సీలపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు తీరాలంటే సోషలిజమే పరిష్కారమని అన్నారు. హిందూ భాషను దేశ ప్రజలపై రుద్దడానికి ఒత్తిళ్లు చేస్తుందని ఆరోపించారు.లౌకికవాదం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువకులదేనని అన్నారు. బీజేపీ హిందుత్వ అజెండాతో ప్రజల్ని మోసం చేస్తుందని విమర్శించారు. అంబాని, అదానీలతో మోదీ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. మహసభల్లో వామపక్షాల నాయకులు, ఇతర దేశాల కమ్యూనిస్టులు పాల్గొన్నారు.