Srisailam Temple | శ్రీశైలం : ధనుర్మాసం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా మల్లికార్జున స్వామికి వార్షిక ఆరుద్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవం సందర్భంగా శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక లింగోద్భవకాల ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, బిల్వార్చన, పుష్పార్చన నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున స్వామివారి ప్రాతఃకాల పూజల అనంతరం ఉత్సవంలో భాగంగా ప్రధాన పురవీధుల్లో నందివాహనసేవ నిర్వహించారు. ఆదివారం రాత్రి ఉత్సవం నిర్విఘ్నంగా జరగాలని గణపతిపూజ జరిపించారు. లోక కల్యాణం కోసం దేశం సుభిక్షంగా ఉండాలని, దేశంలో సుఖశాంతులు విలసిల్లాలని సంకల్పం పఠించారు.
అనంతరం మహాన్యాసాన్ని జరిపి స్వామివారికి లింగోద్భవకాల ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. పంచామృతాలు, పలు ఫలరసాలు, ఆలయప్రాంగణంలోని మల్లికాగుండ జలాలతో అభిషేకం శాస్త్రోక్తంగా జరిపారు. ఆ తర్వాత స్వామివారికి అన్నాభిషేకం చేశారు. అనంతరం పలు రకాల పుష్పాలతో, బిల్వదళాలతో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. సోమవారం వేకువ జామున 3గంటలకు మంగళవాయిద్యాల అనంతరం 3.30 గంటలకు సుప్రభాత సేవ.. ప్రాతఃకాల పూజల అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను స్వామివారి ఆలయ ముఖమండపంలో ఉత్తరముఖంగా వేంచేపు చేసి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం శివాజీగోపుర ద్వారమండపంలో నందివాహన సేవ నిర్వహించారు.
కాగా ప్రతీ ఉత్సవంలో ఆలయ మహాద్వారమైన తూర్పుద్వారం నుంచి గ్రామోత్సవానికి తరలివెళ్లే స్వామిఅమ్మవార్లు సంవత్సరంలో రెండు పర్యాయాలు మాత్రమే ఉత్తరద్వారమైన శివాజీగోపురం నుంచి గ్రామోత్సవానికి తరలివెళ్లడం విశేషం. ముక్కోటి ఏకాదశి రోజున, శివముక్కోటి (వార్షిక ఆరుద్రోత్సవం) రోజున మాత్రమే స్వామిఅమ్మవార్లు ఆలయ ఉత్తరద్వారం నుంచి గ్రామోత్సవానికి తరలివెళ్తారు. గ్రామోత్సవం తర్వాత భక్తులు స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను దర్శించుకునేందుకు వీలుగా ఉత్సవమూర్తులను ఆలయ ముఖమండపం ఉత్తరం వైపున వేంచేపు చేశారు. కార్యక్రమంలో ఈవో ఎం శ్రీనివాసరావు, ప్రధానార్చకులు హెచ్ వీరయ్య, స్థానాచార్యులు ఎం పూర్ణానంద ఆరాధ్యులు, సీనియర్ వేదపండితులు గంటి రాధకృష్ణశర్మ, సిబ్బంది పాల్గొన్నారు.