Srisaila Temple | శ్రీశైలం : ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి గురువారం విశేష పూజలు నిర్వహించారు. ఆరుద్రోత్సవంలో భాగంగా వేకువజామున శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు జరిపించారు. మొదట అర్చకస్వాములు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. అనంతరం స్వర్ణ రథంపై కొలువదీరిన శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు చేశారు. వర్షం నేపథ్యంలో స్వర్ణ రథోత్సవ వేడుకను నిలిపివేశారు. సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా రథోత్సవంలో పలు కళా బృందాల కోలాటం, తప్పెట చిందు మొదలైన కళారూపాలు కూడా ఆలయంలోనే నిర్వహించారు. కార్యక్రమంలో సహాయ కమిషనర్ ఈ చంద్రశేఖర్‌రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు కే శివప్రసాదస్వామి, అర్చకులు, పండితులు పాల్గొన్నారు.
మల్లన్నకు బంగారు విభూతి రేఖలను, అమ్మవారికి ముక్కెరను విరాళంగా ఓ భక్తుడు అందించారు. తిరుపతి కి చెందిన నారాయణమూర్తి 42 గ్రాముల బంగారంతో చేయించిన నామాలను, ముక్కెరను ఆలయ పర్యవేక్షకులు రవికుమార్‌కు అందజేశారు. ఈ సందర్భంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామివారల దర్శనం చేయించారు. ఆ తర్వాత అర్చకులతో వేదాశీర్వచనం చేయించి స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలతో సన్మానించారు. ప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో రవి కుమార్‌తో పాటు సహాయ ప్రజా సంబంధాల అధికారి శివారెడ్డి, జూనియర్ అసిస్టెంట్ సావిత్రి పాల్గొన్నారు.