అమరావతి : వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ( YS Jagan) కూటమి ప్రభుత్వ రెడ్‌బుక్ పాలన ( Red Book Rule ) పై మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయించడం అరాచక పాలనను గుర్తు చేస్తుందని ట్విట్టర్లో విమర్శించారు.
ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే అదేమైనా దేశ ద్రోహమా? తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్టులపై మీకెందుకు అంత కక్ష ? వాళ్లు ఏమైనా మీరు చేయనిది చెప్పారా? మీరు చెప్పనిది చూపించారా? వాస్తవాలు మాట్లాడితే అంత ఉలుకెందుకు? బీసీ వర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్టుగా పనిచేసిన పూడి శ్రీహరి చేసిన తప్పేంటి? అతనిపై అక్రమ కేసు పెట్టడం ఏంటి? అంటూ ప్రశ్నించారు.
తెలంగాణ సీనియర్ జర్నలిస్టు కేవీఆర్‌పై కూడా తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేయడం జంగిల్ రాజ్ పాలనను తలపిస్తుందని పేర్కొన్నారు.గడిచిన రెండేళ్లలో బాలికలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే నిందితులపై చర్యలు తీసుకోని ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు పెట్టడం ఎంత వరకు సమంజసమని అన్నారు.
కూటమికి చెందిన నాయకులు, కార్యకర్తలు మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నా వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వ్యవస్థలను స్వార్థ రాజకీయాలకు వాడుకోవడం సుపరిపాలనా అనిపించుకోదని అన్నారు. అరాచక పాలనకు మూల్యం చెల్లించుకోక తప్పదు. దేవుడు, ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని వైఎస్ జగన్ పేర్కొన్నారు.