అమరావతి : ‘పుర్రకో బుద్ధి అన్నట్లు’ ఎదుటి వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని మోసం చేస్తున్న ప్రబుద్ధుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఓ మోసగాడు పదుల సంఖ్యలో నిరుద్యోగులను
మోసం చేసి చివరకు జైలు ఊచలు లెక్కబెట్టుతున్న వైనం వెలుగులోకి వచ్చింది.
పోలీసు శాఖలో ఉద్యోగం కావాలంటే పోలీసు డ్రెస్ వేసుకుని మోసాలు చేయడం, వైద్యశాఖలో ఉద్యోగం కావాలంటే డాక్టర్ వేసుకునే పైలన్, చేతిలో ఓ స్టెతస్కోప్ వేసుకుని దర్జాగా నిరుద్యోగులను మోసం చేశాడు. కడప జిల్లాకు చెందిన విశ్వనాథపురం గ్రామానికి చెందిన బండారు పృథ్వీ అనే యువకుడు కడప రిమ్స్ కళాశాలలో పార్ట్‌టైం ఉద్యోగం చేసి జల్సాలకు అలవాటు పడ్డాడు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో కొందరికి ఎంబీబీఎస్, డీజీవో చదివిన డాక్టర్‌గా, మరికొందరికి ఖాకీ యూనిఫాంతో పోలీస్ శాఖలో పనిచేస్తున్నానని చెప్పి నమ్మించాడు.
కడపతో పాటు అనంతపురం, వరంగల్, హైదరాబాద్ జిల్లాలకు చెందిన నిరుద్యోగులకు జూనియర్ అసిస్టెంట్లు, క్లర్క్, హోంగార్డు సూపర్వైజర్ పోస్టులను ఇప్పిస్తానని ఆశ చూపి సుమారు రూ.50 లక్షల వసూలు చేశాడు. జరిగిన మోసాన్ని తెలుసుకున్న గుంతకల్లుకు చెందిన బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. నిందితుడిని శుక్రవారం పట్టుకుని అరెస్టు చేసినట్లు గుంతకల్లు డీఎస్పీ నరసింగప్ప వెల్లడించారు. అతడి వద్ద నుంచి రూ. రెండు లక్షల నగదు, రెండు మోటార్ సైకిళ్లు, పోలీస్ యూనిఫాం, పోలీస్ ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నామని వివరించారు.