తిరుపతి : తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో న శుక్రవారం జరుగనున్న వరలక్ష్మీ వ్రతానికి(Varalaxmi Vratam) ఏర్పాట్లు పూర్తయ్యాయని జేఈవో వీరబ్రహ్మం (JEO Veerabrahamam) చెప్పారు. బుధవారం తిరుచానూరులోని ఆస్థాన మండపంలో జేఈవో వరలక్ష్మీ వ్రతంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని విభాగాల సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
రంగురంగుల విద్యుత్ దీపాలు, వివిధ రకాల పుష్పాలతో ఆస్థాన మండపాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయాలన్నారు. ఉత్సవ శోభ ఉట్టిపడేలా ఆస్థానమండపం, ఆలయ పరిసరాల్లో శోభాయమానంగా రంగవల్లులు తీర్చిదిద్దాలన్నారు. అమ్మవారి దర్శనానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. సాయంత్రం 6 గంటలకు పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు తెలియజేశారు.
తిరుమలలో నిండిన కంపార్ట్మెంట్లు .. స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం
తిరుమల : తిరుమల (Tirumala) లో భక్తుల రదీ పెరిగింది. శ్రావణమాసాల సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుంటున్నారు. దీంతో కొండపై ఉన్న 31 కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 73,246 మంది భక్తులు దర్శించుకోగా 28,133 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.35 కోట్లు వచ్చిందన్నారు.