Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 26న శ్రీభ్రమరాంబికా దేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం జరుగనున్నది. ప్రతిఏటా చైత్రమాసం పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారం లేదా శుక్రవారం (ఏ రోజు ముందు వస్తే ఆ రోజు) అమ్మవారికి సాత్విక బలి సమర్పించడానికి ఈ కుంభోత్సవం నిర్వహిస్తారు. ఈ ఏడాది ఈ నెల 26న అమ్మవారికి కుంభోత్సవం నిర్వహిస్తారు. కుంభోత్సవం నేపథ్యంలో అమ్మవారి ఆలయంలో నిర్వహించే అన్ని ఆర్జిత సేవలు, చండీ హోమం నిలిపివేసినట్లు ఈఓ డీ పెద్దిరాజు తెలిపారు. ఉత్సవ సంబంధ విశేష పూజలన్నీ అమ్మవారికి ఏకాంతంగా నిర్వహించడం సంప్రదాయం. దీనివల్ల ఈ నెల 26 రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకూ మాత్రమే భక్తుల సర్వ దర్శనానికి అనుమతి ఇస్తారు.
కుంభోత్సవం నాడు ఆర్జిత రుద్ర హోం, మధ్యాహ్నం వరకూ మాత్రమే శ్రీస్వామి వారి ఆలయంలో సర్వ దర్శనం, ఆర్జిత అభిషేకాలు యధావిధిగా నిర్వహిస్తారు. కుంభోత్సవం సందర్భంగా సాయంత్రం నుంచి శ్రీస్వామి వారి ఆలయంలో సర్వదర్శనం, ఆర్జిత సేవలను నిలిపివేశారు. కుంభోత్సవం మరునాడు ఈ నెల 27వ తేదీ ఉదయం 7.30 గంటల నుంచి ఉభయ దేవాలయాల్లో దర్శనాలు, ఆర్జిత సేవలు నిర్వహిస్తారు.
శ్రీభ్రమరాంబికా దేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం సందర్భంగా ఈ నెల 26న శ్రీ స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం, ఏకాంత సేవ కూడా నిలిపివేశారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ, ధర్మాదాయ చట్టానికి అనుగుణంగా శ్రీశైల క్షేత్ర పరిధిలో పక్షి, జంతు బలులు, జీవ హింసను పూర్తిగా నిషేధించినట్లు ఈఓ డీ పెద్ది రాజు తెలిపారు. కనుక ఎవరైనా క్షేత్ర పరిధిలో పక్షి లేదా జంతు బలులు చేసినట్లయితే ఏపీ పక్షి, జంతు బలుల నిషేధ చట్టం-1950లోని ఆరవ సెక్షన్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.