Maha Kumbh Mela | మహా కుంభమేళాకు వెళ్లాలని అనుకునే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త తెలిపింది. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లేందుకు ప్రత్యేక బస్సులను నడిపించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రత్యేక ప్యాకేజీని ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది.
ఈ యాత్రలో భాగంగా ప్రయాగ్‌రాజ్‌తో పాటు అయోధ్య, కాశీ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే విధంగా టూర్‌ను ఏపీఎస్ఆర్టీసీ ప్లాన్ చేసింది. దీని ప్రకారం మొత్తం 8 రోజుల్లో 3600 కిలోమీటర్లు తిరిగి రావచ్చు. విజయవాడ కేంద్రంగా ఫిబ్రవరి 1వ తేదీన ఈ బస్సులు ప్రారంభం కానున్నాయి.
ఆర్టీసీ బస్సు ప్యాకేజి వివరాలు
– ఫిబ్రవరి 1న ఉదయం విజయవాడ నుంచి ఆర్టీసీ బస్సులు బయల్దేరతాయి. ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రానికి ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటాయి. ఫిబ్రవరి 3, 4వ తేదీల్లో కుంభమేళాలో పుణ్యస్నానాలు, దర్శనం చేసుకునేందుకు సమయం ఇస్తారు. 3వ తేదీ రాత్రి ప్రయాగ్ రాజ్లోనే బస ఉంటుంది. 4వ తేదీ రాత్రి ప్రయాగ్‌రాజ్ నుంచి అయోధ్యకు బస్సులు బయల్దేరతాయి. 5వ తేదీ ఉదయం అయోధ్యకు చేరుకుని.. బాల రాముడి దర్శనానంతరం రాత్రి వారణాసికి బయల్దేరతాయి. 6వ తేదీ వారణాసికి చేరుకుంటుంది. కాశీ విశ్వనాథుడి దర్శనం అనంతరం రాత్రి అక్కడే బస ఉంటుంది.7వ తేదీ ఉదయం వారణాసి నుంచి బస్సులు బయల్దేరతాయి. 8వ తేదీన బస్సులు విజయవాడకు చేరుకుంటాయి.
ఛార్జీల వివరాలు :
ఈ యాత్రలో పిల్లలు, పెద్దలకు ఒకటే ఛార్జి ఉంటుంది. సూపర్ లగ్జరీల్లో రూ.8వేలు, నాన్ ఏసీ స్లిపర్లో రూ.11వేలు, వెన్నెల ఏసీ స్లీపర్‌లో రూ.14,500గా టికెట్ ధర నిర్ణయించారు. ఇవి కేవలం బస్సు ఛార్జీల వివరాలు మాత్రమేనని.. భోజనం, వసతి ఖర్చులు ఎవరికి వారే పెట్టుకోవాల్సి ఉంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. 30 మంది వరకు భక్తులు సమూహంగా వస్తే వారికి ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ముందస్తు రిజర్వేషన్ల కోసం భక్తులు ఆన్లైన్, సమీప బస్ స్టేషన్, ఆర్టీసీ టికెట్ బుకింగ్ ఏజెంట్లను సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 80742 98487, 0866 2523926, 0866 2523928 నంబర్లలో సంప్రదించాలని కోరారు.