అమరావతి : అంధ మహిళా క్రికెట్ కెప్టెన్ దీపిక ( Captain Deepika ) విజ్ఞప్తికి ఏపీ అధికారులు యుద్ధప్రాతిపదికన స్పందించారు. అంధ మహిళా క్రికెట్ ( Blind womens cricket ) ప్రపంచ కప్‌ను సాధించి వచ్చిన జట్టు నిన్న (శుక్రవారం ఉదయం) ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ఒక్కో క్రీడాకారిణికి రూ.5 లక్షల చొప్పున సొంత డబ్బును అందజేసి సన్మానించారు.
క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలానికి చెందిన దీపిక తన గ్రామ రోడ్ల పరిస్థితిని డిప్యూటీ సీఎంకు విన్న వించింది. దీంతో వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ సంబంధిత జిల్లా అధికారులకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
దీంతో స్పందించిన అధికారులు గ్రామానికి వెళ్లి రోడ్ల పరిస్థితిని పరిశీలించి నివేదికను డిప్యూటీ సీఎంకు వివరించారు. హేమావతి పంచాయతీ పరిధిలోని తంబలహెట్టి వరకు రూ. 3.2 కోట్ల రోడ్డు, గున్నేహళ్లి నుంచి తంబలహెట్టీ వరకు రూ. 3 కోట్లతో 5 కి.మీ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపగా సాయంత్రం పవన్ కళ్యాణ్ అప్పటికప్పుడు అనుమతులు మంజూరు చేశారు.