Gudlavalleru Engineering College | గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలోని హిడెన్ కెమెరాల వ్యవహారంపై ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ కాలేజీ హాస్టల్లో నూటికి నూరు శాతం హిడెన్ కెమెరాల అంశం దాగి ఉందని గజ్జల వెంకటలక్ష్మి వ్యాఖ్యానించారు.
కడపలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండు షవర్లను చీకట్లో పోలీసులు ఎత్తుకెళ్లడంపై తమకు అనుమానాలు ఉన్నాయని అన్నారు. కాలేజీ హాస్టల్లో హిడెన్ కెమెరాలు పెట్టారని ఆందోళన వ్యక్తం చేసిన విద్యార్థినులను ప్రిన్సిపల్ బెదిరించడం, తెల్లారేసరికి పరిస్థితులు మారతాయని అనడం అనుమానాలకు తావిస్తున్నాయని గజ్జల వెంకటలక్ష్మి తెలిపారు.
గుడ్లవల్లేరు కాలేజీ హాస్టల్ వాష్రూంల్లో హిడెన్ కెమెరాలు పెట్టి 300 మందికి పైగా అమ్మాయిల వీడియోలు చిత్రీకరించారనే విషయం ఇటీవల సంచలనంగా మారింది. దీనిపై కాలేజీ విద్యార్థినులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వేగంగా దర్యాప్తు చేశారు. కాలేజీ హాస్టల్లో అణువణువునా చెక్ చేవారు. అలాగే అనుమానిత విద్యార్థుల మొబైల్స్, ల్యాప్టాప్లు, ఇతర గ్యాడ్జెట్లను స్వాధీనం చేసుకున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఏపీలో తొలిసారిగా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సేవలను కూడా వినియోగించి కేసు విచారణ చేశారు. చివరకు ఎలాంటి హిడెన్ కెమెరాలు, అనుమానిత వీడియోలు దొరకలేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ పెద్దలు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. కానీ వాళ్ల మాటలకు విరుద్ధంగా ఇప్పుడు మహిళా కమిషన్ చైర్పర్సన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి.