AP Weather | ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ( APSDMA ) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తదుపరి 48 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
ఆదివారం రాత్రి దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. సోమవారం నాడు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మిగతా జిల్లాల్లో పలు చోట్ల పిడుగలతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు. ఇప్పటి నుంచే రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.