AP Weather | ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అల్లూరి జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షం కురుస్తుందని పేర్కొంది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
శ్రీకాకుళం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. చెట్ల కింద నిలబడకూడదని సూచించారు. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదుల లోతట్టు ప్రాంత ప్రజలు పూర్తిగా వరద తగ్గేవరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.