అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వానలు దంచికొడుతున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాష్ట్రంలోని జలాశయాలన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు అనంతపురం జిల్లాలోని చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయి. మరికొన్ని రోజులు ఇదే మాదిరిగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు హెచ్చరించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వానలకు కోనసీమ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. సింగంపల్లిలోని ప్రధాన రహదారిపై నీరు చేరడంతో రాకపోకలు నిలిచి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు జిల్లాలోనూ వానలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అనేక పట్ణణాల్లో డ్రైనేజీలు పొంగి దుర్వాసన వెదజల్లుతుంది. అనంతపురం జిల్లాలోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి. చెరువులన్నీ నిండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తర ఆంధ్ర ప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని పశ్చిమ మధ్య వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది. ఈ కారణంగా ఆదివారం, సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ పేర్కొన్నది. సోమవారం వరకు ఒడిశా తీరం వెంబడి, వాయవ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్రంలోకి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది.