AP Weather Update | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. మరోవైపు విశాఖ తీరం అలజడిగా మారింది. అలల ఉధృతితో సముద్రం చొచ్చుకుని రావడంతో తీరం కోతకు గురయ్యింది.
అల్లూరి జిల్లా, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో శ్రీకాకుళం డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సెలవు ప్రకటించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందున సముంద్రంలో వేటకు వెళ్లొద్దని మత్స్సకారులకు సూచించారు.
మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయాలని, క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రమాదకర హోర్డింగ్లు, కూలిన చెట్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు.