Free Bus | ఎన్నికల హామీ మేరకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని త్వరలోనే అమలు చేస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కడప జిల్లాకు వచ్చిన రాంప్రసాద్ రెడ్డికి టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఉచిత బస్సు ప్రయాణంపై కసరత్తు చేస్తున్నామని తెలిపారు.
పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలో ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం అమలవుతుందని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. దీనిపై మరింత లోతుగా అధ్యయనం జరిపి.. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా రాష్ట్రంలోనూ మహిళలకు ఫ్రీ బస్సును అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. గడిచిన ఐదేండ్లలో వైసీపీ నాయకులు ప్రజా ధనాన్ని దోచుకుతిన్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు తిన్న సొమ్మంతా కక్కించేంత వరకు వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.