Free Bus | త్వరలోనే ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. తెలంగాణ, కర్ణాటకలో అమలవుతున్న ఈ పథకాన్ని అధ్యయనం చేస్తామని తెలిపారు. అక్కడి లోటుపాట్లను గుర్తించి పకడ్బందీగా అమలు చేస్తామని చెప్పారు.
ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కుప్పంలో ఆర్టీసీ కొత్త బస్సులను రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు ఆర్టీసీ స్థలాలు దోచుకున్నారన్న ఆరోపణలపై విచారణ జరుగుతుందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చూస్తామని పేర్కొన్నారు.
ఏపీఎస్ ఆర్టీసీని 100 శాతం ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కృషి చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. ఐదేళ్లలో వీలైనన్ని ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. గత ప్రభుత్వం ఏ శాఖను వదలకుండా అన్నింటిలోనూ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. జగన్ మాటలను ప్రజలు వినే పరిస్థితి లేదని చెప్పారు. రాజకీయ పార్టీల సభలకు ఆర్టీసీ బస్సులను ఫ్రీగా వాడబోమని స్పష్టం చేశారు.