AP speaker : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) అసెంబ్లీకి రాకపోతే అసెంబ్లీ సమావేశాలేమీ ఆగవని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని శాసనసభ స్పీకర్ (Assembly speaker) చింతకాయల అయ్యన్నపాత్రుడు (Ayyannna Pathrudu) అన్నారు. ఈ నెల 22 వరకు అసెంబ్లీ సమావేశాలు సీరియస్‌గా జరుగుతాయని ఆయన స్పష్టంచేశారు.
మంగళవారం బడ్జెట్‌పై అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యేలందరికీ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని అయ్యన్న చెప్పారు. శనివారం కూడా సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. బిల్లులు, చర్చలకు అనుగుణంగా కొన్ని రోజులు రెండు పూటలా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పష్టం చేసినట్లు తెలిపారు.
ప్రజా సమస్యలపై బాధ్యతాయుతమైన చర్చ జరపడం ఎమ్మెల్యేల బాధ్యత అని సీఎం పేర్కొన్నట్లు అయ్యన్నపాత్రుడు చెప్పారు. 1995లో తెల్లవారుజామున 4 గంటలకు రాత్రి భోజనం చేసిన సందర్భాలు ఉన్నాయని ఈ సందర్భంగా అయ్యన్న గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు విధిగా అసెంబ్లీకి హాజరవ్వాలని, చీఫ్ విప్, విప్‌లను మంగళవారం ఖరారు చేస్తామని సీఎం చెప్పినట్టు వెల్లడించారు.