చిత్తూరు : ఎప్పుడూ ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్.. మరోసారి నోరు జారారు. ఎవరిని హెచ్చరిస్తున్నాడో తెలియనంత రీతిలో ప్రసంగం చేశారు. తనకు పదవి వెంట్రుకతో సమానం.. ఎవరికి భయపడేది లేదని అన్నారు. సత్యవేడు మండలంలోని మదనంబేడు గ్రామంలో అంబేడ్కర్ విగ్రాహావిష్కరణ సభలో విక్టర్ ప్రసాద్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
తాను డేంజర్ వ్యక్తినని, తనను పదవి నుంచి తొలగించే ధైర్యం ఎవరూ చేయరన్నా విక్టర్ ప్రసాద్.. తనను పదవి నుంచి అది వెంట్రుకతో సమానంగా భావిస్తానని చెప్పారు. అంతటితో ఊరుకోక తనను తప్పిస్తే అగ్గిరాజేసి వందల అమలాపురాలను సృష్టిస్తానంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఎవరికీ భయపడేది లేదని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో అరెస్టులు జరుగవన్నారు.
రాష్ట్రంలోని పోలీసులు, రెవెన్యూ వారిని నమ్మొద్దని అక్కడికొచ్చిన వారికి సూచించిన విక్టర్ ప్రసాద్.. వీళ్లు మన భూములను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లంతా కలిసి మన హక్కులను హరిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. విక్టర్ ప్రసాద్ వ్యాఖ్యలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. విక్టర్ ప్రసాద్‌ను పదవి నుంచి తొలగించేంత అవసరం ఎవరికి ఉంటుందని స్థానికులు అనుకుంటున్నారు. తనకు పదవి ఇచ్చి కూర్చోబెట్టిన నాయకుడిని హెచ్చరించేలా ప్రసంగం చేయడం తన వర్గం వారిని ఆకట్టుకునేందుకే అని స్థానికులు చర్చించుకుంటున్నారు.