Kethireddy Pedda Reddy | సుప్రీంకోర్టు పర్మిషన్తో తాడిపత్రిలోకి అడుగుపెట్టిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు మరోసారి షాకిచ్చారు. వెంటనే తాడిపత్రి విడిచిపెట్టి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 10వ తేదీన అనంతపురంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కేతిరెడ్డికి పోలీసులు ఈ సూచన చేయడం గమనార్హం.
ఈ నెల 10వ తేదీన అనంతపురం జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ క్రమంలో పోలీసు బలగాలను ముఖ్యమంత్రి పర్యటనకు కేటాయించారు. దీంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి భద్రత కల్పించడం వీలుకాదని.. అందుకే తాడిపత్రి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. సీఎం చంద్రబాబు పర్యటన అనంతరం తిరిగి తాడిపత్రికి రావాలని సలహా ఇచ్చారు. పోలీసుల సూచనలతో తాడిపత్రి నుంచి తన స్వగ్రామం తిమ్మంపల్లికి కేతిరెడ్డి వెళ్లిపోయారు.
తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేతిరెడ్డిని తాడిపత్రిలోకి అడుగుపెట్టనీయకుండా ఆయన్ను జేసీ అనుచరులు అడ్డుకుంటున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు కూడా కేతిరెడ్డిని వెనక్కి పంపించేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో.. ఆగస్టు 18వ తేదీన పోలీసులే స్వయంగా కేతిరెడ్డిని తాడిపత్రిలో దించిరావాలని ఆదేశాలు ఇచ్చింది. కానీ అదే రోజున జేసీ వేరే ఈవెంట్ ఏర్పాటు చేయడంతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు తాడిపత్రికి రావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కేతిరెడ్డిని తాడిపత్రిలోకి అడుగుపెట్టనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం పోలీసులు ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో.. కేతిరెడ్డిని తాడిపత్రికి రావద్దని ఆదేశించింది. దీనిపై తాజాగా కేతిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తాడిపత్రికి వెళ్లేందుకు కేతిరెడ్డికి అనుమతినిచ్చింది. అవసరమైతే ప్రైవేటు బందోబస్తును కూడా ఏర్పాటు చేసుకోవచ్చని సూచించింది. ఈ క్రమంలో ఆయన భారీ పోలీసుల బందోబస్తు నడుమ తాడిపత్రిలోకి అడుగుపెట్టారు. కానీ తాడిపత్రిలోకి వచ్చిన 24 గంటల్లోనే మళ్లీ పట్టణాన్ని విడిచి వెళ్లాల్సి రావడంపై ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చ జరుగుతోంది.