అమరావతి: చేసిన అప్పు తీర్చాలని మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన అమానవీయ ఘటన ఆంధ్రప్రదేశ్లోని కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని నారాయణపురంలో చోటుచేసుకున్నది. నారాయణపురానికి చెందిన తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద రూ.80 వేలు అప్పు తీసుకున్నారు. ఈ క్రమంలో అప్పుల భారం అధికమవడంతో అతడు ఊరు విడిచిపెట్టి వెళ్లిపోయాడు. దీంతో ఆయన భార్య శిరీష శాంతిపురం మండలం కెంచనబల్లలోని తన పుట్టింటికి వెళ్లిపోయారు. బెంగళూరులో కూలి పనులు చేసుకుంటూ కుమారుడిని పోషించుకుంటున్నారు.
అయితే పాఠశాలలో కుమారుడి టీసీ తీసుకునేందుకు శిరీష నారాయణపురం వచ్చారు. విషయం తెలుసుకున్న మునికన్నప్ప.. తన భార్య మునెమ్మ, కుమారుడు రాజా, కోడలు జగదీశ్వరితో కలిసి శిరీషను పట్టుకొని.. భర్త తీసుకున్న డబ్బు చెల్లించాలని వాగ్వాదానికి దిగారు. ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళను విడిపించారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు మునికన్నప్పపై బీఎన్ఎస్ 341/323/324/506/34/ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.