అమరావతి : విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో సామూహిక లైంగిక దాడికి గురైన బాధితురాలని ఏపీ హోం మంత్రి తానేటి వనిత, మంత్రులు విడదల రజిని, జోగిరమేశ్ పరామర్శించారు. విజయవాడ పాత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన రూ. 10 లక్షల పరిహారాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
అనంతరం మంత్రి వనిత మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని అన్నారు. త్వరలోనే గృహ సౌకర్యాన్ని కల్పిస్తామని వెల్లడించారు. ఇంటిలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. నిందితులకు ఉరి శిక్ష విధించాలని బాధిత కుటుంబ సభ్యుల డిమాండ్ కోర్టు పరిధిలోని అంశమని ఆమె పేర్కొన్నారు.
ఫిర్యాదుపై సకాలంలో స్పందించని పోలీసులపై చర్యలు తీసుకున్నామని అన్నారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించినట్లు హోంమంత్రి తెలిపారు. ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ బాధితురాలిని పరామర్శించారు.