మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై మంత్రి సత్యకుమార్ ధ్వజమెత్తారు. కేతిరెడ్డి కేటురెడ్డిగా మారిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. ధర్మవరాన్ని కేతిరెడ్డి దౌర్జన్యాలకు కేంద్రంగా మార్చారని విమర్శించారు. కేతిరెడ్డి గుర్రాల కోటను కూల్చివేస్తామని స్పష్టం చేశారు. కేతిరెడ్డి దౌర్జన్యాలు చేస్తామంటే తాట తీస్తామని హెచ్చరించారు.
తిరుమల లడ్డూ వివాదంపై కూడా మంత్రి సత్యకుమార్ స్పందించారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడే లడ్డూ కల్తీ జరిగిందని తెలిపారు. ఈ పాపం జగన్‌దే అని.. ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ మొదటి నుంచి తిరుమల ప్రతిష్ఠ దెబ్బతీశారని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన బంధువులైన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్లుగా నియమించారని.. తనకు అనుకూలమైన ధర్మారెడ్డిని ఈవోగా నియమించారని చెప్పారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యి విషయంలోనూ జగన్ అబద్ధాలు చెబుతున్నారని మంత్రి సత్యకుమార్ విమర్శించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఆందోళనకు గురయ్యారని అన్నారు. తప్పు చేసిన తానే సంప్రోక్షణ చేస్తానని అంటున్నారని అన్నారు. నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతానని, బయట ఇతర మతాలను గౌరవిస్తానని చెప్పిన జగన్.. డిక్లరేషన్‌లో సంతకం చేసే ధైర్యం లేకనే తిరుమలకు వెళ్లలేదని విమర్శించారు.